దయ్యము పట్టినవాడు | Telugu Christian Illustrations
దయ్యము పట్టినవాడు
అయితే ఆయన - నీవు నీ యింటికి తిరిగి వెళ్లి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియజేయుమని వానితో చెప్పి వానిని పంపివేసెను; వాడు వెళ్లి దేవుడు వానికెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమంతటను ప్రకటించెను (లూకా 8:39),
గెరాసేనుల దేశములో దయ్యము పట్టినవాడు యేసు ప్రభువును ఎదుర్కొన్నాడు. అతడు దుస్తులు ధరించకుండా నగ్నంగా తిరుగుతూ సమాధులలో
నివసించేవాడు. యేసు ప్రభువు
అతనిని స్వస్థపరచిన తరువాత "నేను కూడ మీతో వస్తాను ప్రభువా!" అని బ్రతిమాలాడు. కానీ యేసు ప్రభువు "నీవు ఇక్కడే ఉండి
దేవుడు నీ యెడల చేసిన కార్యముల గురించి
ఇతరులకు వివరించి చెప్పు" అని ఆజ్ఞాపించారు.
అతడు లేచి తన ఇంటివైపు నడక సాగించాడు. కిటికీ నుండి అతని పిల్లలు అతని చూసారు. "అమ్మా! నాన్న వస్తున్నాడు" అని అరిచారు.
ఆమె కంగారుగా “తలుపు మూయండి. కిటికీలు
అన్నీ మూసివేయండి" అని అరిచింది. పిల్లలందరూ తలుపులు మూసివేసారు. పోయినసారి అతడు ఇంటికి వచ్చినప్పుడు కుర్చీలు
విరుగగొట్టాడు. పెంచుకొంటున్న
పూల మొక్కలన్నిటినీ పెరికి పారవేసాడు. పిల్లలు భయంగా చూస్తూ ఉండగా తల్లిని జుట్టు
పట్టుకొని వీధి లోనికి లాగి వీపు మీద పిడిగుద్దులు గుద్దాడు.
ఈసారి అతడు నిశ్శబ్దంగా వచ్చి "సలోమీ! తలుపు తీయి" అని పిలిచాడు.
పెళ్లి అయిన క్రొత్తలో మాత్రమే తనను అలా పిలిచాడు. ఆమె
ఆశ్చర్యంతో ఉండగానే "సలోమీ! నా గురించి
భయపడకు. నేను బాగయ్యాను" అన్నాడు. ఆమె నమ్మలేనట్లుగా కిటికీ తెరిచి తొంగి చూసింది. ఇప్పుడతను నగ్నంగా లేడు. కంగారుగా
తలుపు తెరిచింది. పిల్లలందరూ
ఆశ్చర్యంగా చూస్తున్నారు.
"ఏం జరిగిందో చెప్తాను. అలా కుర్చీలో కూర్చో" అంటూ తాను కూడ ఒక
కుర్చీలో కూర్చొని పిల్లల
వైపు చూసాడు. వారింకా భయంగా అతని చూస్తున్నారు. "నేను ఆ సమాధులలో ఉన్నాను. నజరేతువాడైన యేసు ప్రభువు అక్కడికి
వచ్చారు. ఆయన గురించి నీవు వినే
ఉంటావు. నా వైపు చూసి నీ పేరు ఏమిటి? అని అడిగారు.
నాలో ఉన్న దయ్యములను నన్ను
విడిచి వెలుపలికి రమ్మని ఆయన ఆజ్ఞాపించారు.
వెంటనే దయ్యములు నన్ను విడిచి అక్కడ ఉన్న పందుల మందలో ప్రవేశించినవి. ఆ పందులన్నీ నీటిలో పడి చచ్చిపోయినవి. నేను ఆయన వెంట
వస్తానని అన్నాను. కానీ ఆయన ఇక్కడే ఉండి
ఆయన చేసిన అద్భుత కార్యమును ఇతరులకు చెప్పమన్నారు” అని జరిగినదంతా చెప్పారు. తమ తండ్రి బాగయ్యాడని తమ
స్నేహితులకు చెప్పుటకు అతని పిల్లలు
వీధి లోనికి పరుగు తీసారు.
డా॥పి.బి.మనోహర్
Comments
Post a Comment